బాధితులు మరణించినాసరే ఆగని లోన్ యాప్ వేదింపులు

ఎక్కడ చూసిన లోన్ యాప్ నిర్వాహకుల వేదింపులు ఎక్కువైపోతున్నాయి. వీరి వేదింపులు తట్టుకోలేక ఇప్పటికే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డబ్బు ఆశ చూపడం..ఎలాంటి ఆధారాలు లేకుండానే డబ్బులు ఇవ్వడం ఆ తర్వాత అధిక వడ్డీ తో డబ్బును వసూళ్లు చేయడం చేస్తున్నారు. సకాలంలో డబ్బు చెల్లించకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ బెదిరింపులకు భయపడి చాలామంది ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలకే కాదు రాజకీయ నేతలకు సంబదించిన వ్యక్తులకు కూడా ఈ బెదిరింపులు వదలడం లేదు. తాజాగా వీరి వేదింపులు తట్టుకోలేక అల్లూరి సీతారామరాజు జిల్లా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకొని వారి కూతుళ్లను అనాధులను చేసిన ఘటన అందర్నీ కంటతడిపెట్టిస్తుంది. బాధితులు చనిపోయిన సరే మనీయాప్‌ నిర్వాహకుల వేధింపుల కొనసాగుతున్నాయంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు.

వివరాల్లోకి వెళ్తే..

అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గారావు పదేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చారు. ఆరేళ్ల కిందట రమ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. నగరంలోని శాంతినగర్‌లో ఉంటున్న వీరికి తేజస్వి నాగసాయి(4), లిఖితశ్రీ(2) ఇద్దరు సంతానం. దుర్గారావు పెయింటింగ్‌, రమ్యలక్ష్మి టైలరింగ్‌ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల వీరు రెండు ఆన్‌లైన్‌ రుణయాప్‌లలో కొంత మొత్తం నగదు అప్పుగా పొందారు. వాటిని నిర్ణీత సమయంలో చెల్లించకపోవడంతో యాప్‌ల నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. వారి బెదిరింపులను తాళలేక కొంత మొత్తం నగదును చెల్లించారు. మరింత చెల్లించాలని, లేదంటే రమ్యలక్ష్మి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియా లో పెడతామని హెచ్చరించారు.

ఈ బాధలు తప్పించుకోవాలనే ఉద్దేశంతో దుర్గారావు పది రోజుల కిందట ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్‌గా చేరి అదనపు సంపాదన కోసం ప్రయత్నించారు. ఈలోగా అసభ్యకరంగా ఉన్న ఓ చిత్రానికి రమ్యలక్ష్మి ముఖం వచ్చేలా మార్ఫింగ్‌ చేసి యాప్‌ల నిర్వాహకులు వాట్సాప్‌లో బెదిరించారు. రెండు రోజుల వ్యవధిలో పూర్తి రుణాన్ని వడ్డీతోసహా చెల్లించకుంటే ఈ చిత్రంతోపాటు అసభ్యకరంగా వీడియోను తయారు చేసి పంపుతామని హెచ్చరించారు. దాంతో గుండెపగిలిన దంపతులు ..గోదావరి గట్టున ఉన్న ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక దీనిపై మనీ యాప్‌ నిర్వాహకులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను నియమించినట్లు అదనపు ఎస్పీలు వెంకటేశ్వరరావు, రజని తెలిపారు.