చిరంజీవితో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమావేశం

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు..మెగాస్టార్ చిరంజీవి తో భేటీ కావడం సర్వత్రా చర్చగా మారింది. ఈ సమావేశంలో ఇరువురూ పలు విషయాలపై చర్చించుకున్నట్టు , ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్టు చెపుతున్నారు. గంటా శ్రీనివాసరావు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఉమ్మడి ఏపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోనూ మంత్రిగా పనిచేశారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఆయన గెలవడం ఖాయమని అంత నమ్ముతారు. అలాంటి నేత దాదాపు మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఒకానొక సందర్భంలో.. ఆయన టీడీపీని వీడతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ.. ఆ మధ్య చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లిన సందర్భంలో.. గంటా కనిపించారు. దీంతో ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారని నమ్మకానికి వచ్చారు.

తాజాగా ఈయన మెగాస్టార్‌ చిరంజీవితో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చిరంజీవి ఇంటికి వచ్చారు గంటా శ్రీనివాసరావు. గతంలో ప్రజా రాజ్యం పార్టీలో కీలక నేతగా ఉన్నారు గంటా శ్రీనివాస రావు. దీంతో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గాడ్ ఫాదర్ సినిమా విజయవంతం కావడంతో విషెష్ చెప్పడానికే చిరంజీవిని కలిశానని గంటా శ్రీనివాస రావు చెబుతున్నా.. మెగా మీట్ లో రాజకీయ చర్చ కూడా జరిగిందనే ప్రచారం సాగుతోంది. గాడ్‌ఫాదర్ సినిమా సక్సెస్ సందర్భంగా అభినందనలు తెలియజేయడానికే అని గంటా వర్గీయులు చెబుతున్నారు. ఈ ఇద్దరు భేటీపై పూర్తి క్లారిటీ రాలేదు. అసలు విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇక గాడ్ ఫాదర్ మూవీ విషయానికి వస్తే దసరా సందర్బంగా గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. RB చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించగా , థమన్ మ్యూజిక్ అందించారు.