గణేష్ ఉత్సవాలఫై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్ష

ఆగస్టు 31 నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా, ప్రశాంత వాతావరణంలో గణేశ్‌ ఉత్సవాలు జరిగేలా క్షేత్ర స్థాయి నుంచి సిబ్బంది సిద్ధం కావాలని సీపీ సీవీ ఆనంద్‌ అధికారులకు సూచించారు. సోషల్‌మీడియాలో వచ్చే వదంతులు, తప్పుడు పోస్టులపై నిఘా పెట్టాలన్నారు.

అనంతరం సీపీ మాట్లాడుతూ… గణేశ్ ఉత్సవాల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి గణేశ్ మండపం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులను కోరారు. అలాగే మండపాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు తప్పకుండా చేసుకోవాలన్నారు. మరోవైపు వినాయక చవితి నేపథ్యంలో నగరంలో విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రుల వేడుకలు ఏ స్థాయి లో జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. ఆ వేడుకలను చూసేందుకు భారీ ఎత్తున జనం నగరానికి చేరుకుంటారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని చూడడానికి జనం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక నిమజ్జనానికి అదే స్థాయిలో ప్రజలు వస్తుంటారు. ఈ నేపథ్యంలో భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ అధికారులు.