చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా..క్షణాల్లో చేపలు మాయం

అసలే ధరలు మండిపోతున్నాయి. ఏం కొనాలన్నా..ఏం తినాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో మనకు కావాల్సినవి ఫ్రీగా వస్తున్నాయంటే ఉరుకుంటామా..అందులోనూ ఎంతోఇష్టంగా తినే చేపలు దొరికితే వదిలిపెడతామా. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడడంతో అందులోని చేపలన్నీ రోడ్డు ఫై పడ్డాయి. అంతే వాటిని చూసిన జనాలు..ఒక్కసారిగా వాటిపై పడడంతో క్షణాల్లో చేపలు మాయం అయ్యాయి. ఈ ఘటన బూర్గంపాడు మండలం క్రాస్ రోడ్డు వద్ద జరిగింది.

చేపల లారీ బోల్తా పడింది అని తెలుసుకున్న వారంతా పరుగుపరుగున వచ్చి చేపలను తీసుకెళ్లడం మొదలుపెట్టారు. గుంపులుగుంపులుగా జమ కూడిన జనాలు చేపల కోసం ఎగబడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే చేపల కోసం ఒక చిన్నపాటి యుద్ధమే చేశారు. ఒక్క అరగంటలోనే లారీలో ఉన్న లోడు చేపలు అన్నింటిని మాయం చేశారు. ఇక చేపల కోసం ఎగబడుతున్న జనాలను కట్టడి చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారడంతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో చేతులెత్తేశారు. సంచులు తెచ్చుకొని మరీ ఒక్కొక్కరు కిలోల కొద్దీ చేపలను ఎత్తుకెళ్లారు. ఇక బాగా చేపలు దొరికిన వారి ముఖాలు కళకళలాడాయి. ఇక టూ వీలర్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా వాహనాలను ఆపి మరీ చేపలను ఎత్తుకెళ్ళారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

చెట్ల పొదలలోనూ చేపల కోసం కొట్లాట టన్నుల కొద్ది చేపలు రోడ్డు మీద పడడంతో రోడ్ మీద వాహనాల రాకపోకలను సైతం లెక్కచేయకుండా వాటికి అడ్డుపడుతూ మరీ చేపల కోసం పోరాటం సాగించారు. ఇక చెట్ల పొదల్లోనూ సంచులు, షాపింగ్ బ్యాగ్స్ ఇలా ఏది దొరికితే అది తీసుకుని చేపలు పోగేసుకునే పనిలో పడ్డారు. కొంత మంది సుష్టుగా నాలుగు రోజుల పాటు చేపల కూరే తినేలా ప్లాన్ చేసుకుని మరీ చేపల సేకరణ చేశారు. ఇదిలా ఉంటే పోలీసులు లారీ బోల్తా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ బోల్తా ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.