మంచు విష్ణు..అప్పుడే తన గొప్ప మనసు చాటుకున్నారు

మా నూతన అధ్యక్షుడి గా ప్రమాణ స్వీకారం చేసారో లేదో మంచు విష్ణు అప్పుడే తన గొప్ప మనసు చాటుకున్నారు. విశాఖ గైడ్ లైన్స్ ప్రకారం… మా అసోసియేషన్ లో ఉమెన్ ఎంపవర్ మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు మంచు విష్ణు. ఈ కమిటీకి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి సునీత కృష్ణన్ గౌరవ సలహాదారు గా ఉంటారని విష్ణు స్పష్టం చేశారు.
‘మహిళల ప్రాధాన్యత దృష్ట్యా ‘విమెన్ ఎంపర్మెంట్ అండ్ గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నందుకు గర్వంగా ఉంది. మహిళా సాధికారిత కోసం ఈ కమిటీ ఏర్పాటు చేశాం. పద్మశ్రీ సునీత కృష్ణన్ సలహాదారుగా పనిచేయనున్నారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు ఇద్దరు పురుషులు ఉంటారు. వారి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని అన్నారు. ఇక మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు తన మేనిఫెస్టోలో ఒక్కో అంశాన్ని అమలు చేసే దిశగా అడుగులేస్తున్నారు. దానికి ఇదే ఉదాహరణ గా చెప్పాలి.
మరోపక్క ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రకాష్ రాజ్…ఓ పక్క మంచు విష్ణు కు సపోర్ట్ గా ఉంటామని చెపుతూనే పోలింగ్ వ్యవహారం ఫై రోజుకో విషయాన్నీ బయటకు తీసుకొస్తున్నారు. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుందంటూ ఆరోపణలు చేస్తూ.. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు లేఖ రాశారు. వైకాపా పార్టీ కార్యకర్త నూకల సాంబశివరావును ఎన్నికల ప్రాంగణంలోకి ఎలా అనుమతించారంటూ ఆయన ఎన్నికల అధికారిని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. జగ్గయ్య పేటకు చెందిన సాంబశివరావరకు క్రిమినల్ రికార్డ్ ఉందని, అలాంటి వ్యక్తి ఎన్నికల ప్రాంగణంలోకి ఎలా వచ్చాడని, ఎన్నికలు జరిగే సమయంలో సాంబశివరావు అనే వ్యక్తి ‘మా’ సభ్యులను బెదిరించారని ప్రకాశ్ రాజ్ తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఎలక్షన్ ఆఫీసర్‌ను కోరారు. అలాగే విష్ణు మంచుతో నూకల సాంబశివరావు ఉన్న ఫొటోలను ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. త్వరలోనే వీడియోలను కూడా బయట పెడతానని తెలిపారు.