బీహార్‌లో‌ ప్రారంభమైన చివరిదశ పోలింగ్‌

ఓటుహక్కు వినియోగించుకోనున్న 2.34 కోట్ల మంది

Bihar polls 2020

పట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల చివరిదశ పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 15 జిల్లాల్లోని 78 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, 1,204 మంది అభ్యర్థులు ఉన్నారు. సుమారు 2.34 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ ఎన్నికలతోపాటు జేడీయూ ఎంపీ బైద్యనాథ్ మహతా మృతితో ఖాళీ అయిన వాల్మీకినగర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది. ఏన్డీయే, మహాఘట్‌బంధన్‌‌తోపాటు చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం, బీఎస్పీ, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన ఆర్ఎల్ఎస్‌పీ‌లు ఈ విడతలో పట్టు సాధించాలని పట్టుదలగా ఉన్నాయి.

ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో ఉన్న 30 శాతం ముస్లిం జనాభాపై ఎంఐఎం ఆశలు పెట్టుకుంది. ఇక్కడ పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టిన అసద్, వారి కోసం విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. మరోవైపు, ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాని మోడి కూడా బీహార్‌లో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రతిపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన మోడి, నితీశ్‌కే మళ్లీ పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/