మూడో రోజు కూడా విచారణకు హాజరుకావాలంటూ రాహుల్ కు ఈడీ సమన్లు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ని నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు మూడో రోజు కూడా హాజరుకావాలని సమన్లు జారీ చేసారు. ఈరోజు రాహుల్ ను దాదాపు తొమ్మిది గంటల పాటు విచారించారు. ప్రివెన్ష‌న్ ఆఫ్ మ‌నీ లాండ‌రింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని 50వ సెక్ష‌న్ కింద రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. రెండో రోజు కూడా ప్ర‌శ్న‌లు అసంపూర్తిగా మిగిలి ఉన్నందున బుధ‌వారం మ‌రోమారు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని రాహుల్‌గాంధీకి జారీ చేసిన స‌మ‌న్ల‌లో ఈడీ పేర్కొంది. మంగ‌ళ‌వారం ఉద‌యం 11.05 గంట‌ల‌కు ఈడీ కార్యాల‌యానికి చేరుకున్న రాహుల్‌కు మ‌ధ్యాహ్నం గంట‌పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు.

దీంతో ఈడీ కార్యాల‌యం నుంచి మ‌ధ్యాహ్నం 3.45 గంట‌ల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చిన రాహుల్ తిరిగి 4.45 గంట‌ల‌కు ఈడీ ఆఫీసుకు వ‌చ్చారు. ఇక ఇప్పటివరకు 19 గంటల పాటు రాహుల్‌ను ఈడీ అధికారులు విచారించారు. రాహుల్‌గాంధీపై ఈడీ విచార‌ణ‌కు నిర‌స‌న‌గా రెండో రోజు కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఢిల్లీలో నిర‌స‌న తెలిపారు. ఈ నిర‌స‌న‌లో పాల్గొన్న‌ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు రేపు బుధవారం (జూన్ 15న) ‘బచావో హైదరాబాద్’ పేరుతో అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో టీటీడీపీ, టీజెఎస్, బీఎస్పీ, వామపక్ష పార్టీలు, ఆప్, జనసేన, వైఎస్ఆర్ సీపీ, ఇంటి పార్టీ, లోక్ సత్తా పార్టీల ప్రతినిధులు, మహిళా సంఘాలు, మేధావులు, పాత్రికేయ ప్రముఖులు పాల్గొననున్నారు.

అఖిల పక్ష భేటీకి రావాలంటూ రేవంత్ రెడ్డి స్వయంగా వివిధ పార్టీ అధ్యక్షులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, షర్మిలకు ఫోన్ చేసి రావాలని రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లో డ్రగ్స్, జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్, లా అండ్ ఆర్డర్ లపై చర్చించనున్నారు.