మరో రెండు, మూడు రోజుల్లో కేజ్రీవాల్‌ ను అరెస్ట్‌ చేయబోతున్నారుః ఆప్‌ నేత

CM Kejriwal will be arrested in next 2-3 days, claims AAP leader

న్యూఢిల్లీః సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ను మరో రెండు, మూడు రోజుల్లో అరెస్ట్‌ చేయబోతున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత, మంత్రి సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో బిజెపి ఈ చర్యకు దిగబోతోందని చెప్పారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయబోతున్నారని బిజెపి వర్గాల నుంచే తమకు సమాచారం ఉందని వెల్లడించారు.

కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేస్తారనే సందేశాలు వస్తున్నాయని సౌరభ్‌ భరద్వాజ్‌ ఈ సందర్భంగా చెప్పారు. మరో రెండు లేదా మూడు రోజుల్లో కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఈడీని బిజెపి రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు. ‘మరో 2-3 రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయనున్నట్లు మాకు సమాచారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంత తొందరపాటు ఎందుకు ప్రదర్శిస్తుందనేదే ప్రశ్న. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే కేజ్రీవాల్‌ను జైలులో పెట్టడం ఖాయమని బిజెపికి చెందిన నేతలు చెప్పారు. అలా జరగకూడదంటే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకపోవడమే మంచిదని బిజెపి వాళ్లు చెబుతున్నారు’ అని సౌరభ్‌ భరద్వాజ్‌ వెల్లడించారు. ఆప్‌-కాంగ్రెస్‌ పొత్తు నేపథ్యంలో బిజెపి భయపడుతోందన్నారు. అందుకే ఇలాంటి కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ మధ్య పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఢిల్లీలో పాల‌క ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. ఢిల్లీలో ఇరు పార్టీల మధ్య సీట్ల స‌ర్దుబాటు ఖ‌రారైన క్రమంలో గుజ‌రాత్‌, గోవా, హ‌రియాణ రాష్ట్రాల్లోనూ పొత్తు దిశ‌గా చ‌ర్చలు తుది ద‌శ‌కు చేరుకున్నాయ‌ని తెలిసింది. ఇరు పార్టీల మ‌ధ్య ప‌లు రాష్ట్రాల్లో పొత్తుపై త్వరలో అధికారిక ప్రక‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.