ఇదే యూనివర్శిటీలో చదివి.. గౌరవ డాక్టరేట్‌ పొందడం అనిర్వచనీయమైన అనుభూతి

cji-justice-nv-ramana-recives-honorary-doctorate-from-nagarjuna-university

గుంటూరుః సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే 37, 38 స్నాతకోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. వర్శిటీ ఛాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌, వైస్‌ చాన్సలర్‌ రాజశేఖర్‌తో పాటు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. సీజేఐ ఎన్వీ రమణ ఈ విశ్వవిద్యాలయం పూర్వి విద్యార్థి కావడం విశేషం. ఈ సందర్భంగా పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలతోపాటు పట్టాలను బహూకరించారు.

ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఈ విశ్వవిద్యాలయంలో చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు. తాను చదువుకున్న యూనివర్శిటీ నుంచే గౌరవ డాక్టరేట్‌ పొందడం అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతున్నానన్నారు. ఇక్కడి క్యాంటీన్‌ తమ అడ్డా అని, ఇక్కడ కూర్చుని ఎన్నో విషయాలపై చర్చించేవారమన్నారు. అలాంటి చర్చలు ఇప్పుడు జరగడం లేదని విచారం వ్యక్తం చేశారు. సమస్యలపై యువత స్పందించాలని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా తయారుకావాలని సూచించారు.

గత 40 ఏండ్లుగా నాగార్జున విశ్వవిద్యాలయం విద్యా రంగానికి అందిస్తున్న సేవలు అమోఘమైనవని ప్రశంసించారు. హోలిస్టిక్‌ విద్యా విధానం అమలవుతేనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సమాజం కోసం, సమాజం అవసరాల కోసం ఉత్తమ పౌరుల్ని తయారుచేసేలా విద్యా విధానం ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పరిశోధనలకు పెద్ద పీఠ వేయాలని, అందుకు తగినట్లుగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. యూనివర్శిటీకి అవసరమైన నిధులు అందించేలా మంత్రి బొత్స చొరవ తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/