సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందిః తైవాన్‌కు చైనా వార్నింగ్

తైవాన్‌ చుట్టూ సైనిక విన్యాసాల అనంతరం చైనా ప్రకటన

Chinese military ‘ready to fight’ after completing combat exercises near Taiwan

బీజింగ్‌ః తైవాన్ పై చైనా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది. ఇప్పటికే ‘జాయింట్‌ స్వోర్డ్‌’ పేరుతో తైవాన్ చుట్టుపక్కల ప్రాంతాలను చైనా సైనిక విన్యాసాలతో బలగాలను మొహరించింది. ఈ నేపథ్యంలోనే తైవాన్ పై ఎప్పుడైనా యుద్ధం మొదలు కావచ్చని చైనా స్పష్టం చేసింది. అందుకు సిద్ధంగా ఉండాలని తైవాన్ ను హెచ్చరించింది. యుద్ధం ఎప్పుడు మొదలైనా సరే, పోరాడేందుకు తమ బలగాలు రెడీగా ఉన్నాయని, స్వాతంత్రం కోసం తైవాన్ ప్రయత్నించినా, ఈ విషయంలో విదేశాలు జోక్యం చేసుకున్నా.. అందుకు తాము ధీటుగా బదులిస్తామంటూ చైనా సైన్యం తైవాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మూడు రోజుల పాటు తైవాన్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా యుద్ధ విన్యాసాలు చేస్తుండటంతో యుద్ధం త్వరలోనే మొదలవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.

గత వారం తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌వెన్ అమెరికా పర్యటన తర్వాత.. తైవాన్ చుట్టూ చైనా సైన్యం మూడు రోజుల భారీ పోరాట విన్యాసాలు చేసింది. ఈ విన్యాసాల్లో చైనా గగనతల పోరాట సామర్థ్యాలపై దృష్టిసారించింది. తొలిసారిగా జె-15 యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొనగా… అవి చైనా విమాన వాహకనౌకల నుంచి తైవాన్‌ గగనతలంలోకి ప్రవేశించాయి. 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 35 యుద్ధవిమానాలు తైవాన్‌ జలసంధిలోని మీడియన్‌ లైన్‌ను దాటాయి. షాండాంగ్‌ విమాన వాహకనౌకను కూడా పసిఫిక్‌ మహాసముద్రంలో చైనా ఉపయోగించింది.