తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా వారి సేవలో నిమగ్నమై ఉన్నాంః చంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన అధినేత‌

chandrababu-naidu-tweet-on-tdp-42nd-foundation-day

అమరావతిః టిడిపి 42వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు స్పెష‌ల్ ట్వీట్ చేశారు. అందులో.. “తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా.. 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్ గారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళాలి అంటూ.. ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో నిమగ్నమై ఉంది తెలుగుదేశం. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషిచేస్తుంది తెలుగుదేశం. మరోసారి మీ అందరికీ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు” అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.

అలాగే గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా కూడా టిడిపి అధినేత విషెస్ తెలియ‌జేస్తూ మ‌రో ట్వీట్ చేశారు. “పాలకుల అక్రమాల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నందుకు వారంతా కుట్ర చేసి క్రీస్తుకు శిలువ శిక్ష వేయించారు. అటువంటి దుర్మార్గులను కూడా క్షమించిన కరుణామయుడు క్రీస్తు. అందుకే ఆయన యుగకర్త అయ్యాడు. సాటి మనిషిని ప్రేమించడం.. బలహీనులకు అండగా నిలవడం కన్నా ఉత్తమమైన ధర్మం లేదన్న క్రీస్తు సందేశాన్ని ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మననం చేసుకుందాం” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.