రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం

Centre invites farmers for fifth round of talks, urges to find solution through dialogue

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో భాగంగా శంభు సరిహద్దు వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే రైతులు ఇంకా భారీగా తరలివస్తుండటంతో వారిపై భాష్పవాయు గోళాలు ప్రయోగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆ మేరకు భాష్పవాయు గోళాలను సిద్ధంగా ఉంచుకున్నారు.

ఈ క్రమంలో కేంద్ర సర్కారు రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా ఒక ప్రకటన చేశారు. రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరోసారి చర్చలకు రావాల్సిందిగా రైతులను ఆహ్వానిస్తున్నామని, కనీస మద్దతు ధర, పంట మార్పిడి, వ్యర్థాల దహనంపై రైతులతో చర్చకు సిద్ధమని ఆయన చెప్పారు.

అదేవిధంగా గత ఆందోళనల సందర్భంగా రైతులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఎత్తివేతపై చర్చిస్తామని అర్జున్‌ ముండా తెలిపారు. దేశంలో శాంతి నెలకొనాలంటే చర్చలు చాలా ముఖ్యమని అన్నారు. కాగా, తమ డిమాండ్‌లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని రైతులు అంటున్నారు. పంటలకు కనీస మద్దతు ధరపై పార్లమెంట్‌లో చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.