ఇకపై అవినీతికి ఆస్కారమే ఉండబోదు

10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌..సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ కొత్త రెవెన్యూ చట్టాన్ని శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..ఇకపై రాష్ర్టంలోని రిజిస్ర్టేష‌న్ కార్యాల‌యాల్లో అవినీతికి ఆస్కార‌మే లేదని తేల్చిచెప్పారు. గ‌త ప్ర‌భుత్వాలు వీఆర్వోల‌కు అన‌వ‌స‌ర అధికారాలు ఇవ్వ‌డంతో అరాచ‌కాల‌కు పాల్ప‌డ్డార‌ని సిఎం గుర్తు చేశారు. ఈ క్ర‌మంలో వీఆర్వోల‌ను ర‌ద్దు చేసి క‌ఠిన నిర్ణ‌యాల‌ను తీసుకున్నామ‌ని తెలిపారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారా ఇక‌పై త‌హ‌సీల్దార్లు కూడా అవినీతికి పాల్ప‌డే అవ‌కాశ‌మే లేద‌న్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో మార్పుల‌కు త‌హ‌సీల్దార్‌కు అవ‌కాశం లేద‌న్నారు. స‌బ్ రిజిస్ర్టార్ల‌కు ఎలాంటి విచ‌క్ష‌ణా అధికారం లేద‌న్నారు.

ప‌ది నిమిషాల్లోనే రిజిస్ర్టేష‌న్లు పూర్త‌య్యేలా ఏర్పాట్లు చేస్తామ‌ని కెసిఆర్ పేర్కొన్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో అప్‌డేట్ కాగానే సంబంధిత కాపీలు వ‌స్తాయ‌న్నారు. రిజిస్ర్టేష‌న్‌, మ్యుటేష‌న్‌, అప్‌డేష‌న్ కాపీలు వెంట‌నే వ‌స్తాయ‌న్నారు. బ‌యోమెట్రిక్, ఐరిస్, ఆధార్‌, ఫోటోతో రిజిస్ర్టేష‌న్లు చేస్తామ‌న్నారు. ఈ వివ‌రాల‌న్నీ లేకుండా త‌హ‌సీల్దార్ల‌కు పోర్ట‌ల్ తెరుచుకోదు. ప‌క‌డ్బందీ వ్యూహంతో పేద రైతుల హ‌క్కులు కాపాడుతామ‌న్నారు. రైతులు, ప్ర‌జ‌లకు లంచాలు ఇచ్చే బాధ త‌ప్పాల‌నేది ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని చెప్పారు. రెవెన్యూ కోర్టులు ర‌ద్దు చేశామ‌ని తెలిపారు. వివాదాల ప‌రిష్కారానికి కోర్టుకు వెళ్ల‌వ‌చ్చు అని సూచించారు. కావాల‌ని వివాదాల‌కు వెళ్లే వారి విష‌యంలో ప్ర‌భుత్వం స‌మ‌యం వృథా చేయ‌దు అని సిఎం కెసిఆర్‌ స్ప‌ష్టం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/