రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో ఇరుక్కున్నారు

సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కు వివాదాలు అనేవి కొత్తమీ కాదు..తరుచు ఏదొక వివాదం లో చిక్కుకోవడం , కోర్ట్ నుండి నోటీసులు అందుకోవడం ఈయన కు కామన్. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో నిలిచిన వర్మ..తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ లో ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ సినిమా కోసం రూ.56 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేశారంటూ ఓ ఫైనాన్షియర్ ఫిర్యాదు చేశారు. కోర్టు దావా ఆధారంగా ఆయన ఫిర్యాదు చేయడంతో మియాపూర్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద వర్మపై కేసు నమోదు చేశారు.

” 2019లో నా స్నేహితుడి ద్వారా వర్మతో పరిచయం ఏర్పడింది. 2020లో దిశ సినిమా కోసం నా దగ్గర డబ్బు తీసుకున్నారు. ఆ ఏడాది జనవరిలో రూ.8 లక్షలు ఇచ్చాను. ఆ తర్వాత మరోమారు రూ.20 లక్షలు ఇవ్వాల్సిందిగా వర్మ విజ్ఞప్తి చేయడంతో 2020 జనవరి 22న ఆ డబ్బు కూడా చెక్ రూపంలో ఇచ్చాను. ఆరు నెలల్లో తిరిగిచ్చేస్తానంటూ వర్మ చెప్పారు. ఆ తర్వాత అదే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో ఆర్థిక కష్టాలున్నాయని చెప్పి మరో రూ.28 లక్షలు తీసుకున్నారు. దిశ సినిమా విడుదలైన రోజు లేదా అంతకన్నా ముందే తిరిగిచ్చేస్తానని హామీ ఇవ్వడంతో ఆయన్ను నమ్మి డబ్బులిచ్చాను’’ అని ఫైనాన్షియర్ తెలిపారు. తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించగలరని ఫిర్యాదులో పేర్కొన్నారు.