మనీష్ సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచలేం: సుప్రీంకోర్టు

గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్న

‘Can’t keep Manish Sisodia in jail indefinitely’: Supreme Court to probe agencies

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీశ్ సిసోడియా విషయంలో సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో వాదనలు వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేసింది. సిసోడియాను ఎల్లకాలం జైలులోనే ఉంచలేరని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ట్రయల్ కోర్టులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కేసులో వాదనలు ప్రారంభించాలని సూచించింది. సిసోడియా అరెస్టుకు ముందు గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకున్నారా అంటూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్టి ల ధర్మాసనం ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు స్పందిస్తూ.. లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకున్నాకే అరెస్టు చేసినట్లు తెలిపారు. ఉపముఖ్యమంత్రితో పాటు 18 శాఖల బాధ్యతలు చూసిన నేత లంచం తీసుకోవడం తీవ్రమైన విషయమని, సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, మనీలాండరింగ్ కోణం ఉందని ఈడీ, సీబీఐ విచారణ చేపట్టాయి. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో కేసు నమోదు చేసి పలువురు నేతలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మనీశ్ సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరి 26న అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు. బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తులను కింది కోర్టులు కొట్టేయడంతో సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.