భారత్‌లోని కెనడా ప్రజలు అప్రమత్తంగా ఉండండిః అడ్వైజరీ జారీ చేసిన ట్రూడో ప్రభుత్వం

Canada Urges Citizens To Be Cautious, Keep Low Profile In These Indian Cities

ఒట్టావా : ఖలిస్థాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య అంశంపై భారత్‌, కెనడా మధ్య సంబంధాలు మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి. భారత్‌ ఆదేశాల మేరకు కెనడా తమ దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 41 మంది కెనడా దౌత్యవేత్తలు భారత్‌ను వీడినట్లు ప్రకటించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే భారత్‌లో పర్యటిస్తున్న తమ దేశ పౌరులకు కీలక హెచ్చరికలు చేసింది. భారత్‌లోని పలు నగరాల్లో ఉన్న కెనడా వాసులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది.

ఇటీవలే చోటు చేసుకున్న పరిణామాలతో భారత మీడియా, సామాజిక మాధ్యమాల్లో కెనడాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అడ్వైజరీలో పేర్కొంది. ఈ క్రమంలోనే కెనడా పౌరులపై బెదిరింపులు, వేధింపులు జరగొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. అందువల్ల దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాలతోపాటు బెంగళూరు, చండీగఢ్‌, ముంబై నగరాల్లో ఉన్న కెనడియన్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఎవరూ తమ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించింది.