భువనగిరి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఫై పార్టీ శ్రేణులు ఆగ్రహం

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..ఈ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో 17 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం..వారికీ బీ ఫారాలు అందించి ప్రచారం చేయించడం మొదలుపెట్టారు. చాల చోట్ల అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రచారం మొదలుపెట్టి..ప్రజల్లో బిఆర్ఎస్ ఫై నమ్మకం కలిగేలా చేస్తున్నారు. అయితే భువనగిరి బిఆర్ఎస్ అభ్యర్థి విషయంలో మాత్రం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన క్యామ మల్లేష్‌ను అభ్యర్థిగా ప్రకటించి 20 రోజులకు పైగా గడిచింది. నామినేషన్ల గడువు కూడా మరో రెండు రోజుల్లో ముగియనుంది. అయినప్పటికీ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే సమావేశాలకు తప్ప మరెక్కడా కూడా ఆయన కనిపించిన దాఖలాలు లేవు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చుట్టూ ప్రదక్షిణ చేయడం తప్ప కనీసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సెకండ్ క్యాడర్ ఆ స్థాయి ప్రజా ప్రతినిధులను కూడా కలిసి మాట్లాడే పరిస్థితి లేదని ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా క్యామ మల్లేష్‌ కింది స్థాయి నేతలను కలవడం..ప్రచారం ముమ్మరం చేయకపోతే మేమంతా పార్టీ మారేందుకు సిద్ధం అవుతామని హెచ్చరిస్తున్నారు.