ఐదో సారీ ఈడీ విచారణకు అరవింద్‌ కేజ్రీవాల్‌ దూరం

ED notice to Delhi CM for the fourth time

న్యూఢిల్లీః ఢిల్లీ మద్యం పాలసీ కేసు లో ఈడీ ముందు విచారణకు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి నిరాకరించారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ నాలుగుసార్లు జారీ చేసిన నోటీసులను ఆయన లెక్క చేయలేదు. తాజాగా ఐదోసారి జారీ చేసిన సమన్లను కూడా బేఖాతరు చేశారు. ఈ మేరకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కేజ్రీని అరెస్ట్‌ చేసేందుకు మోడీ సర్కార్‌ కుట్ర పన్నుతోందని ఆరోపించింది. ఈ కుట్రలో భాగంగానే ఈడీ అధికారులు ఆప్‌ సుప్రిమోకు పదే పదే సమన్లు పంపుతున్నారని ఆరోపించింది. ‘కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయడమే మోడీ లక్ష్యం. ఆయన్ని అరెస్ట్‌ చేయడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటున్నారు. ఇలా జరగడానికి మేము ఎప్పటికీ అనుమతించము’ అని ఆప్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్‌కు ఈడీ గత నాలుగు నెలల్లో నాలుగు సార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే. అయితే, ఇంత వరకూ ఆయన విచారణకు హాజరు కాలేదు. గ‌తంలో న‌వంబ‌ర్ 2న‌, డిసెంబ‌ర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్‌ ప‌ట్టించుకోలేదు. ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలంటూ ఈడీ అధికారులు బుధవారం నోటీసులు పంపారు. ఈ సమన్లను కూడా కేజ్రీ బేఖాతరు చేశారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.