లండన్ పారిపోయేందుకు యత్నించిన అమృత్ పాల్ సింగ్ భార్య

Amritpal Singh’s wife held for questioning at Amritsar airport, was trying to flee to London

అమృత్‌సర్‌: పరారీలో ఉన్న రాడికల్ సిక్కు నేత అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ లండన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఈ సంఘటన జరిగింది. ఖలిస్థాన్‌ వేర్పాటువాద నాయకుడు, వారిస్ పంజాబ్ డీ చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ఛేజ్‌ చేయగా తప్పించుకున్నాడు. మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

కాగా, అమృత్‌పాల్‌ సింగ్‌ పరారీలో ఉండటంతో ఆయన భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను పంజాబ్‌ పోలీసులు ప్రశ్నించారు. వారిస్ పంజాబ్ డీ సంస్థకు విదేశీ నిధులను సమకూర్చడంతో ఆమె కీలకపాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్‌దీప్‌ కౌర్‌పై నిఘా ఉంచడంతోపాటు ఎల్‌వోసీ జారీ చేశారు. దీంతో గురువారం మధ్యాహ్నం 1.20 విమానంలో లండన్‌ వెళ్లేందుకు అమృత్‌సర్‌ విమానాశ్రయానికి వచ్చిన కిరణ్‌దీప్‌ కౌర్‌ను ఇమిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. పోలీసులకు ఈ సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆమెను విమానాశ్రయంలో ప్రశ్నించారు.

మరోవైపు అమృత్‌పాల్‌ సింగ్‌ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ ఎన్నారై. ఆమె పంజాబ్‌లో పుట్టినప్పటికీ తల్లిదండ్రులు బ్రిటన్‌లో స్థిరపడటంతో అక్కడ పెరిగింది. ఆమెకు సోషల్‌ మీడియా ద్వారా అమృత్‌పాల్‌ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో గత ఏడాది ఫిబ్రవరిలో వారిద్దరికి పెళ్లి జరిగింది. నాటి నుంచి ఆమె పంజాబ్‌లోనే ఉంటున్నది. ఒక ఇంటర్వ్యూలో అమృత్‌పాల్‌ సింగ్‌ను మోడల్ భర్తగా కిరణ్‌దీప్ కౌర్‌ అభివర్ణించింది.