కనీస వసతులు లేని గ్రామం నుంచి నా ప్రస్థానం మొదలైంది – ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఈరోజు పదవీ విరమణ చేసారు. 2014 ఫిబ్రవరి 17వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన రమణ.. గత ఏడాది ఏప్రిల్ 24వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. అయన కంటే ముందు సీజేఐగా పని చేసిన శరద్ అరవింద్ బాబ్డే నుంచి బాధ్యతలను స్వీకరించారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి 48వ చీఫ్ జస్టిస్‌గా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. పదవీ విరమణ సందర్బంగా సుప్రీం కోర్టులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎన్వీ రమణ ప్రసంగిస్తూ.. తన జీవితంలో ఎదురైన అనేక విషయాలను గుర్తు చేసుకున్నారు. 12 ఏళ్ల వయసులో తొలిసారి కరెంటు చూసినట్లు పేర్కొన్నారు. 17 ఏళ్లకు ట్రేడ్‌ యూనియన్‌కు నేతృత్వం వహించానని తెలిపారు. ఈ వృత్తిలో అనేక ఒడిదొడుకులు వస్తాయని న్యాయవాదులు గ్రహించాలని సూచించారు. కనీస వసతులు లేని గ్రామం నుంచి తన ప్రస్థానం మొదలైందని, వృత్తి పరంగా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు.. తాను గొప్ప జడ్జీని కాకపోవచ్చు కానీ, సామాన్యూడికి న్యాయం అందించడానికి కృషి చేశానని రమణ స్పష్టం చేశారు.

ఇక NV రమణ పదవీకాలంలో 174 తీర్పులను ఇచ్చారు. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడానికి ముందు.. 2000 నుంచి 2013 వరకు జస్టిస్ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు. కొన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. తర్వాత 2013 నుంచి 2014 వరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేశారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో ఎన్వీ రమణ కృషి చేశారు.