బిజెపి సమావేశాల్లో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్ షా..

హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీ కేంద్రంగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం పార్టీ కీల‌క నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్టీ రాజ‌కీయ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన తీర్మానంలో తెలంగాణ అంశం చర్చకు వచ్చింది. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టబోతోందని పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని… వారసత్వ రాజకీయాలను అసహ్యించుకుంటున్నారని షా తీర్మానంలో పొందుపరిచారు.

కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కొవిడ్‌, సర్జికల్‌ స్ట్రైక్స్‌ సహా రాహుల్‌గాంధీని ఈడీ ప్రశ్నించినా… రాజకీయమే చేస్తోందన్నారు. విభజనవాదులకు సహరిస్తూ… గందరగోళం సృష్టించాలని చూస్తోందని దుయ్యబట్టారు. కశ్మీర్‌ను అంతర్జాతీయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై అమిత్‌షా విరుచుకుపడ్డారు. అవకాశవాద, అవినీతి రాజకీయాలకి కాంగ్రెస్‌ వేదికగా మారిందని విమర్శించారు.

ఇక తెలంగాణ‌తో పాటు ప‌శ్చిమ బెంగాల్‌లోనూ బీజేపీని అధికారంలోకి తీసుకువ‌స్తామ‌ని స‌ద‌రు తీర్మానంలో అమిత్ షా ప్ర‌తిపాదించారు. అంతే కాదు కేర‌ళ‌, ఏపీలోనూ పార్టీని అధికారంలోకి తీసుకువ‌స్తామ‌ని ఆయ‌న స్పష్టం చేసారు. బీజేపీ ఏ ఒక్క రాష్ట్రాన్ని ప్ర‌త్యేక దృష్టితో చూడ‌ద‌ని, దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను ఏక‌దృష్టితోనే చూస్తుంద‌ని అమిత్ షా అన్నారు. ఇక మోడీ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ ఎంపీలు నియోజకవర్గాల్లోకి వెళ్లాలని సూచించారు. సమావేశాల అనంతరం మూడు రోజుల పాటు ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.