బిజెపి ఓ విష సర్పం..మరోసారి ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

బిజెపిని పంపించాలంటే, అన్నాడీఎంకేని తుడిచిపెట్టేయాలని పిలుపు

After Sanatana Dharma remark, Udhayanidhi Stalin calls BJP a ‘poisonous snake’

చెన్నైః సనాతన ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడి పెద్ద దుమారమే లేపిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. ఇప్పుడు బీజేపీ లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. బిజెపిని ఓ విషసర్పం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడులోని నైవేలీలో డీఎంకే ఎమ్మెల్యే సభా రాజేంద్రన్ వివాహ వేడుక సందర్భంగా స్టాలిన్ ఈ విధంగా మాట్లాడారు. అదే విధంగా అన్నాడీఎంకే పార్టీని సైతం స్టాలిన్ టార్గెట్ చేశారు. విషసర్పాలకు చోటునిచ్చే చెత్తకుప్పగా పేర్కొన్నారు.

లోక్ సభ ఎంపీ, డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ రాజా కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోడీని సర్పంతో పోల్చగా, తాజాగా ఉదయనిధి ఇదే విధమైన పోలికతో బిజెపిని తూలనాడారు. ‘‘విషసర్పం మీ ఇంట్లోకి వస్తే దాన్ని తీసి బయట పడేస్తే సరిపోదు. ఎందుకంటే అది మీ ఇంటి సమీపంలోని చెత్తకుప్పలో దాగి ఉండొచ్చు. ఇంటి సమీపంలోని చెత్తను శుభ్రం చేయనంత వరకు ఆ పాము మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది.

ఇప్పుడు దీన్ని ప్రస్తుతం మన రాష్ట్రంలోని పరిస్థితితో పోల్చి చూస్తే.. తమిళనాడు మన ఇల్లు. ఇక్కడ విష సర్పం బిజెపి. మీ ఇంటి సమీపంలో ఉన్న చెత్తకుప్ప అన్నాడీఎంకే. మీరు చెత్తను తుడిచివేయనంత వరకు ఆ విష సర్పాన్ని దూరంగా పంపించలేరు. బిజెపిని వదిలించుకోవాలంటే, మీరు అన్నాడీఎంకేని కూడా తుడిచిపెట్టేయాల్సిందే’’ అంటూ ఉదయనిధి పేర్కొన్నారు.