1178 ట్విటర్‌ ఖాతాలు బ్లాక్‌ చేయండి..కేంద్రం

సామాజిక మాధ్యమ సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని సరిహద్దులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళన గురించి సోషల్‌మీడియాలో దుష్ప్రచారం వ్యాప్తి చెందుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రెచ్చ‌గొట్టే ట్వీట్లు చేస్తున్నాయ‌ని కేంద్రం పేర్కొంది. ఈ ఖాతాల‌ను తొల‌గించాల‌ని ట్విట్ట‌ర్‌కు కేంద్రం విజ్ఞ‌ప్తి చేసిన‌ప్ప‌టికీ, ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం ఆదేశాల‌ను ట్విట్ట‌ర్ సంస్థ పట్టించుకోలేద‌ని తెలుస్తోంది. 1,178 పాకిస్తాన్ ఖ‌లీస్తాన్ ట్విట్ట‌ర్ ఖాతాల‌ను తొల‌గించాల‌ని, రైతుల ఆందోళ‌న‌ల‌పై త‌ప్పుడు స‌మాచారం చేర‌వేస్తున్న‌ట్లు కేంద్రం తెలిపింది.


గ‌త రెండు నెల‌ల‌కు పైగా కొత్త సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌డుతున్నారు. త‌క్ష‌ణ‌మే కొత్త సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున జ‌రిగిన ప‌రిణామాల దృష్ట్యా కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. రైతుల‌ను రెచ్చ‌గొడుతున్న శ‌క్తుల‌పై దృష్టి సారించింది.