విశాఖ ఉక్కుకు దిక్కెవరు?

ఆంధ్రాలో మళ్లీ ఉద్యమించేందుకు సమాయత్తం

vizag steel plant
vizag steel plant


ఎన్నో పోరాటాలు, మరెందరో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్ర పాలకులు నిర్ణయించడంపట్ల తెలుగు ప్రజల్లో ఆవేద నలేకాదు ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మళ్లీ ఉద్యమించేందుకు సమాయత్తం అవుతున్నారు.

అసలు ఈ నష్టాలు ఎందుకు వస్తున్నాయి?ఎప్పటి నుంచి వస్తున్నాయి? లాభాలతో నడిచిన కర్మాగారం నష్టాలఊబిలోకి ఎందుకు కూరుకుపోయింది? తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా విశాఖఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆనాడు దిక్కులు పిక్కటిల్లేలా సాగిన ఉద్యమంలో ఏకంగా ముప్పైరెండు మంది ప్రాణత్యాగాలు చేశారు.దేశంలో ఆనాటికే నాలుగు ఉక్కు కర్మాగారాలున్నాయి.

1963లో తీరప్రాంతంలో మరో పరిశ్రమ ఏర్పాటుచేయాలని ఆనాటి కేంద్ర పెద్దలు ప్రతిపాదించారు. నిపుణులు అధ్యయనంచేసి దేశంలోని అన్ని తీరప్రాంతాలను పరిశీలించి విశాఖపట్నం అన్నిం టికి సానుకూలంగా ఉంటుందని, అక్కడే ఉక్కు కర్మా గారాన్ని ఏర్పాటు చేయాలని సిఫారసుచేశారు. అయితే కొందరు రాజకీయ నేతలు తమతమ రాష్ట్రాలకు ఈ కర్మాగారాన్ని తరలించుకుపోయేందుకు తమకు ఉన్న రాజకీయ ఒత్తిడిని ఉపయోగించి ప్రయత్నాలు పెద్దఎత్తునే మొదలుపెట్టారు.

నిపుణుల కమిటీ ప్రతిపాదించినా చివరి నిమిషంలో తరలించుకుపోతున్నారనే వార్తలతో ఆనాడు ఆందోళన చిన్నగా మొదలై తారాస్థాయికి చేరుకున్నది. ఉద్యమ ఉధృతకు తలొగ్గిన పాలకులు ఆమోదం తెలి పినా ఏదో కుంటిసాకులు చూపుతూ పనులు మొదలు పెట్టకపోవడంతో పెద్దఎత్తున ఆందోళన మొదలైంది. జన జీవనమే స్తంభించిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

వాస్తవంగా ఈ ఉక్కు కర్మాగారానికి, ప్రజాపోరాటానికి ప్రజా ప్రతినిధులు కూడా బాసటగా నిలిచారు. కొందరు శాసన సభ్యత్వాలకు, పార్లమెంటు సభ్యత్వాలకు రాజీ నామాలు చేశారు. గుంటూరుకు చెందిన తమనంపల్లి అమృతరావ్ఞ అనే వ్యక్తి విశాఖపట్టణానికి వచ్చి కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరాహారదీక్షకు దిగారు. మరోపక్క తెన్నేటి విశ్వనాథం అధ్యక్షతన అఖిలపక్ష సంఘం ఏర్పాటైంది.

ఉద్యమం రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ సహా అన్ని ప్రాంతాలకు విస్తరించింది.వేలాదిమందికి ఉపాధి కల్పించే పరిశ్రమ కోసం ప్రధానంగా యువకులు ఆందోళన కార్య క్రమంలో పాల్గొనడంతో కొంత విధ్వంసం కూడా చోటు చేసుకున్నది. కొన్ని ప్రాంతాల్లో పోలీసుస్టేషన్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు నష్టం జరిగింది. పోలీసులు కాల్పులు కూడా జరపాల్సివచ్చింది.

దీంతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 1971 జనవరి 20న విశాఖకు వచ్చి పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. కర్మాగారం నిర్మాణానికి దాదాపు ఇరవైఏళ్ల సమయం పట్టింది. 1992లో అప్పటి ప్రధాని పి.వి నరసింహారావ్ఞ చేతుల మీదుగా ఈ భారీ కర్మాగా రాన్ని జాతికి అంకితంచేశారు.

తాజాగా ఆంధ్రుల హక్కుగా భావించే ఈ భారీ కర్మాగారాన్ని వందశాతం ప్రైవేటీ కరిస్తున్నట్లు కేంద్ర పార్ల మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ (డీఐసీప ీఏఎం) కార్యదర్శి ప్రకటించారు. జనవరి 27వ తేదీన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొ న్నారు. ప్రభుత్వం చెప్తున్నట్లు ఒకప్పుడు భారీనష్టాలు వాటిల్లినమాట వాస్తవమేకావచ్చు.

ఆ తర్వాత అది ఇరవై ఒక్కవేల కోట్లకుపైగా టర్నోవర్‌ను సాధించే స్థాయికి చేరు కున్నది. 2010 నవంబరులో దీనికి నవరత్న హోదా కూడా కల్పించారు. ఇంతటి సుదీర్ఘ ఘనచరిత్ర ఉన్న సంస్థ2015నుంచి నష్టాల్లో కూరుకుపోతున్నది. అన్నింటి కంటే ముఖ్యంగా ఇంతపెద్ద భారీ కర్మాగారానికి సొంత గనులు లేకపోవడమే అందుకు ప్రధాన కారణమని పార్ల మెంట్‌ స్థాయీసంఘం ఏనాడో వెల్లడించింది.

2015- 16లో పధ్నాలుగువందల కోట్లు, 2016-17లో పన్నెండు వందల యాభై కోట్లు, 2017-18లో పదమూడు వందల యాభై కోట్లకుపైగా నష్టాలువచ్చాయి.ఇందుకు కారణాలు, కారకులను విశ్లేషిస్తే వాస్తవాలు ఏమిటో బయటకు వస్తా యి. మార్కెట్‌ పరిస్థితులు, అన్నింటికంటే ముఖ్యంగా చైనా నుంచి వచ్చే చౌక దిగుమతులే విశాఖ ఉక్కును నష్టాలఊబిలోకి నెట్టేశాయని చెప్పొచ్చు.సొంతగనులులేక, ముడిసరుకు అంతాబయటి నుంచి కొనాల్సిరావడమే ఈ నష్టాలకు కారణం.అయితే ఈ నష్టాల నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు జరిగాయి.

2018-19లో తొంభై ఆరు కోట్ల లాభంతో ముందుకు అడుగువేసింది.కానీ 2019-20కల్లా మళ్లీ ఆరువందల కోట్లకుపైగా నష్టాలను చవిచూసింది.దేశంలో ప్రైవేట్‌రంగంలో నడుస్తున్న ఎన్నో కర్మాగారాలు లాభాల వైపు నడుస్తుంటే విశాఖఉక్కు ఎందుకు నష్టాలు చవి చూస్తున్నదో పాలకపెద్దలు మనసు పెట్టి ఆలోచించాలి.

ఒకపక్క దేశంలో స్టీల్‌కు డిమాండ్‌ అంతకంతకు పెరుగుతున్నది.ధరలు కూడా అదేస్థాయిలో అందుకోలేకుండా పెరిగిపోతున్న దశలో ఇప్పుడు ప్రైవేట్‌ పరంచేయాలనే నిర్ణయం ఏమాత్రం సమంజసంకాదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశాఖఉక్కును తాము తీసుకోవడా నికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు.

ఇప్పటికే అప్పులఊబిలో కూరుకుపోయిన ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వమే నిర్వహణ బాధ్యతలను చేపట్టగలిగిన ప్పుడు కేంద్రప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తున్నదనే ప్రశ్న ఉదయించకతప్పదు. ఈ వివాదాల కంటే గనులను కేటాయిస్తే విశాఖఉక్కుకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుంది. వేలాదిమంది సామాన్య,మధ్యతరగతి వారికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న ఈ భారీప్రభుత్వరంగ సంస్థను ప్రైవేట్‌ పరం చేయడం ఏకోణంలో చూసినా ధర్మంకాదు.

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌