బంగ్లాదేశ్ ప్ర‌ధానికి పైనాపిల్స్

అగ‌ర్తలా: బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు త్రిపుర సీఎం విప్ల‌వ్‌దేవ్ కుమార్ త‌న‌ రాష్ట్రానికి చెందిన‌ పైనాపిల్స్‌ను గిఫ్ట్‌గా పంపించారు. ఆదివారం ఓ ఆటో ట్రాలీలో మొత్తం 400 పండ్ల‌ను బంగ్లాదేశ్‌కు త‌ర‌లించారు. మ‌ర్యాదపూర్వ‌కంగానే తాను బంగ్లా ప్ర‌ధానికి పైనాపిల్స్ పంపుతున్నాన‌ని త్రిపురం సీఎం చెప్పారు. కాగా, త్రిపుర ముఖ్య‌మంత్రి చేసిన ఈ పనికి చిట్ట‌గాంగ్‌లోని భార‌త రాయ‌బారి ఉదోత్ ఝా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇరు దేశాల మ‌ధ్య స్నేహాన్ని, దీర్ఘ‌కాలంగా రెండు దేశాల మ‌ధ్య కొనసాగుతున్న అనుబంధాల‌ను ఇలాంటి ప‌రిణామాలు మ‌రింత బ‌లోపేతం చేస్తాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

కాగా, బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా కూడా ఇటీవ‌ల త‌మ దేశానికి హ‌రిబంగా రకం మామిడి పండ్ల‌ను భార‌త్‌కు పంపించారు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి, త్రిపుర సీఎం విప్ల‌వ్‌దేవ్ కుమార్‌తోపాటు బంగ్లాదేశ్ పొరుగునున్న అన్ని భార‌త రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఆమె హ‌రిబంగా ర‌కం మామిడి పండ్ల‌ను చేర‌వేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా త్రిపుర ముఖ్య‌మంత్రి విప్ల‌వ్ దేవ్.. బంగ్లా ప్ర‌ధానికి పైనాపిల్స్ పంపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/