ప్ర‌జలంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన కేసీఆర్ , జగన్

ఈరోజు దసరా సందర్బంగా ప్రజలందరికి ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు ఏపీ సీఎం జగన్. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి జగన్‌ శుభాకాంక్షలు అంజేశారు. లోక కంటకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు.. దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకొంటున్నామని సీఎం జగన్‌ అన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికీ విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ముఖ్య‌మంత్రి ఆకాంక్షించారు.

అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయదశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకొంటారని పేర్కొన్నారు. దసరా రోజున శుభసూచకం గా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సంప్రదా యం గొప్పదని అభివర్ణించారు. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకొంటూ, అలయ్‌ బలయ్‌ తీసుకొంటూ, ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా ప్రత్యేకత అని తెలిపారు. అనతికాలంలోనే అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన.. దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతిబాటలో నడువాలని సీఎం ఆకాంక్షించారు. విజయానికి సంకేతమైన దసరా నాడు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని సీఎం ప్రార్థించారు. ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్‌ కోరుకొన్నారు.