మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన ఉషా శ్రీ చరణ్,వెంకట నాగేశ్వరరావు

ఏపీలో కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పలువురు..వారి బాధ్యతలను చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు తమ బాధ్యతలను చేపట్టగా..గురువారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా శ్రీ చరణ్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం ఉషా శ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ మహిళనైన నాకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా నాకు అవకాశం ఇచ్చారు. మహిళా పక్షపాత ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉండటం అదృష్టం. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం అన్నారు. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రిగా గురువారం కారుమూరి వెంకట నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భాంగా మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదన్నారు. పౌర సరఫరాల శాఖలో పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు.