ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు

నవంబర్‌ 7న తొలి విడత..నవంబర్‌ 17న రెండో విడత పోలింగ్‌

Elections in Chhattisgarh in two phases

న్యూఢిల్లీ: తెలంగాణ‌లో పాటు నాలుగు రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఆ రాష్ట్రంలో పలు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నందున భద్రతా కారణాల రీత్య రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. నవంబర్‌ 7న తొలి విడత పోలింగ్‌, నవంబర్‌ 17న రెండో విడత పోలింగ్‌ జరుగుతుందని ప్రకటించారు.

తొలి విడతలో పోలింగ్‌ జరిగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అక్టోబర్‌ 13న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్‌ల ప్రక్రియ మొదలై అక్టోబర్ 20 వరకు కొనసాగనుంది. అక్టోబర్‌ 21న నామినేషన్‌ల స్క్రూటినీ జరుగుతుంది. అక్టోబర్‌ 23 ను నామినేషన్‌లను ఉపసంహరించుకునేందుకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 7న పోలింగ్‌ జరుగుతుంది.

రెండో విడత పోలింగ్‌కు సంబంధించి అక్టోబర్‌ 21న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలై అదే రోజు నామినేషన్‌లు మొదలుకానున్నాయి. అక్టోబర్‌ 30 వరకు నామినేషన్‌లను స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 31న నామినేషన్‌ల స్క్రూటినీ నిర్వహిస్తారు. నామినేషన్‌ల ఉపసంహరణకు నవంబర్‌ 2 వరకు అవకాశం కల్పించారు. నవంబర్‌ 17న రెండో దశ పోలింగ్‌ జరుగుతుంది. రెండు విడతల్లో పోలైన ఓట్లను డిసెంబర్‌ 3న లెక్కించనున్నారు.

కాగా, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఆ రాష్ట్రంలో 2018కి ముందు దాదాపు 15 సంవత్సరాలు బిజెపి అధికారంలో ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ 68 స్థానాలు, బిజెపి 15 స్థానాలు, ఇతరులు మిగతా స్థానాల్లో విజయం సాధించారు. భూపేశ్‌ బఘేల్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌, బిజెపిల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది.