రేపటి నుండి 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ కొవిడ్ టీకా బూస్టర్ ..

కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం కరోనా టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు డోసులు వేయగా..రేపటి (ఏప్రిల్ 10) నుండి 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ కొవిడ్ టీకా బూస్టర్ వేయబోతుంది. ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో కరోనా టీకా ప్రికాషన్ డోసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. కరోనా టీకా రెండో డోసు తర్వాత తొమ్మిది నెలల పూరైనవారు బూస్టర్ డోసు తీసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా అర్హులైన వారందరికీ కరోనా మొదటి, రెండో డోసు టీకాతో పాటు ఆరోగ్య కార్యకర్తలందరికీ, 60 ఏళ్లు పైనున్నవారికి ఇస్తున్న బూస్టర్ డోసును యథావిధిగా కొనసాగిస్తారు.

ఇప్పటికే 12-14 ఏళ్ల పిల్లల్లో 45 శాతం మంది మొదటి డోసు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. తొలి రెండు డోసులు ఏ టీకా తీసుకున్నారో.. ప్రికాషన్‌ డోసు కూడా అదే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రస్తుతమున్న తొలి, రెండు డోసుల పంపిణీ అలాగే కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోసు వల్ల ఒమిక్రాన్‌ నుంచి సమర్థమైన యాంటీబాడీ రక్షణ లభిస్తోందని పలు పరిశోధనల్లో ఇప్పటికే తేలింది.