తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బిఆర్ఎస్ పుట్టిందిః సిఎం కెసిఆర్‌

cm kcr Public Meeting at nirmal

హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా ఆశీర్వాద సభను గురువారం నిర్వహించింది. ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొని ప్రసంగిచారు. దేశంలోనే మొదటిసారిగా దళిత బంధు స్కీమ్ తెచ్చాం, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నమని కెసిఆర్ వెల్లడించారు. ఈసీ అనుమతిస్తే ఇప్పుడే రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ అంటున్నారు. రైతులకు 3గంటలు కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. ధరణి తీసేస్తే… రైతుబంధు, రైతుబీమా కూడా పోతాయి, ధరణి తీసేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని సిఎం కెసిఆర్ తెలిపారు.

నష్టం వచ్చినా రైతుల వద్ద పంట కొంటున్నామన్నారు. గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని వెల్లడించారు. అభివృద్ధి కొనసాగాలంటే… మళ్లీ భారాస గెలవాలన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ సెక్యులర్ గా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఇవాళ 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోందన్నారు. ధాన్యం దిగుబడిలో త్వరలోనే తెలంగాణ రాష్ట్ర పంజాబ్ ను అధిగమిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కావాలని ఇంద్రకరణ్ రెడ్డి తపనపడ్డారని ఆయన వెల్లడించారు. ఇంద్రకరణ్ రెడ్డి మెజారిటీ 80 వేలు దాటాలని కెసిఆర్ సూచించారు. పదేళ్లుగా శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బిఆర్ఎస్ పుట్టిందన్నారు సిఎం కెసిఆర్. 15 ఏళ్లు నిర్విరామంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు.

బిఆర్ఎస్ పుట్టిందే ప్ర‌జ‌ల కోసం, హ‌క్కుల కోసం, నీళ్లు, నిధులు, నియామ‌కాల కోసం అని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో న‌ష్టం రాకుండా ఉండాల‌ని ఆలోచించే కాపల‌దారే బిఆర్ఎస్. రెండు సార్లు బిఆర్ఎస్‌ను ఆశీర్వ‌దించారు. తెలంగాణ రాక‌పోతే నిర్మ‌ల్ జిల్లా అయ్యేదా..? ఇవ‌న్నీ ఆలోచించాలి. నిర్మ‌ల్ జిల్లాను చేయించింది ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డినే. ఆదిలాబాద్ జిల్లాలో ఏం చేద్దాం ఎన్ని జిల్లాలు చేద్దామ‌ని ఆలోచించాం. ఆదిలాబాద్‌తో పాటు మంచిర్యాల చేయాల‌ని నిర్ణ‌యించాం. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మ‌ళ్లీ గంట త‌ర్వాత వ‌చ్చారు. బాస‌ర నుంచి ఆదిలాబాద్, బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ రావాలంటే చాలా స‌మ‌యం ప‌డుత‌ది. కాబ‌ట్టి నాలుగు జిల్లాలు చేయాల‌ని అడిగారు. నిర్మ‌ల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కావాల‌ని గంట‌సేపు వాదించారు. ఈ నాలుగు జిల్లాలు చేసిందే ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డినే. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ప్ర‌జ‌లు చేయెత్తి దండం పెడుతున్నారు. నాలుగు మెడిక‌ల్ కాలేజీలు వ‌చ్చాయి. ఇవాళ ఇంజినీరింగ్ కాలేజీ కావాల‌ని అడిగారు. త‌ను పుట్టిన ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబ‌ట్టి.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి అడుగుతున్నాడు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. ఈ స‌భ‌తో ఇంద్ర‌క‌ర‌ణ్‌ రెడ్డి గెలిచిండ‌ని తెలిసిపోయింది. ప్ర‌జ‌ల కోసం తండ్లాడే వ్య‌క్తి. నిర్మ‌ల్ చాలా అభివృద్ధి జ‌రిగింది. ఇంజినీరింగ్ కాలేజీ పెద్ద విష‌యం కాదు.. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మెజార్టీ 70 వేలు దాటాలి.. క‌చ్చితంగా జేఎన్టీయూ నుంచి ఇంజినీరింగ్ కాలేజీ ఇప్పించే బాధ్య‌త నాది అని కెసిఆర్ పేర్కొన్నారు.