యోగా, ధ్యానం తో విద్యార్థుల్లో ఆలోచనా శక్తి

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

 President Ramnath kovind talking to students
President Ramnath kovind talking to students

Madanapalli : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చిత్తూరు జిల్లా మదనపల్లెలో సత్సంగ్‌ ఆశ్రమంలో ఆదివారం జరిగిన పర్యటన విజయవంత మైంది. బెంగుళూరు నుంచి రాష్ట్రపతి వైమానికదళ హెలిక్యాప్టర్‌లో చిప్పిలి హెలిప్యాడ్‌ వద్దకు 11.56 గంటలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, సత్సంగ్‌ వ్యవస్థాపకులు ముంతాజ్‌ అలీ, జిల్లా కలెక్టర్‌, ఎస్‌పి, ఎంపిలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.

హెలిప్యాడ్‌ నుంచి రాష్ట్రపతి సత్సంగ్‌ ఆశ్రమంకు 12.20 గంటలకు రోడ్డు మార్గంలో చేరు కున్నారు. రోడ్డు పొడవునా ప్రజలకు అభివాదం చేశారు. సత్సంగ్‌ ఫౌండేషన్‌లో ఆశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన, భారత్‌యోగా విద్యాకేంద్రంను ఫ్రారంభించారు. అదేవిధంగా ఆశ్రమంలోని శివాలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతి ఇచ్చారు. విశ్వవిద్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం 38 పడకల స్వాస్థ్య ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సత్సంగ్‌ విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.

6వ తరగతి నుంచి10వ తరగతి వరకు చదివే విద్యార్థుల పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు, వృత్తి వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ మీరు మంచి విద్యాలయంలో చదువుతున్నారని, విద్యార్థులు తనలా గొప్పస్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానన్నారు.

సత్సంగ్‌ ఫౌండేషన్‌కు రావడం సంతోషకరంగా ఉందన్నారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వ్యవస్థాపకులను అభినందిం చారు. విద్యతోపాటు వ్యాయామం ఎంతో అవసరమని ప్రతిరోజూ ఉదయం యోగా చేయడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలన్నారు. యోగా, ధ్యానం చేయడంవల్ల ఆలోచనా శక్తి మెరుగుపడుతుందన్నారు.

విద్యార్థులు అనేక రకాల భాషలు నేర్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించా లన్నారు. సత్సంగ్‌ వ్యవస్థాపకులు, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత ముంతాజ్‌ అలీతో రాష్ట్రపతి పలు విషయాలు చర్చించారు. ఆశ్రమంలో పేద విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, యోగా, స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ గురించి రాష్ట్ర పతికి వివరించారు.

ఆశ్రమంలో ముగిసిన కార్యక్రమాలు అనంతరం 3.20 గంటలకు చిప్పిలి హెలిప్యాడ్‌ నుంచి సదుంలోని పీపల్‌గ్రోవ్‌ స్కూల్‌కు బయలుదేరారు. రాష్ట్ర పతి వెంట హెలిక్యాప్టర్‌లో ఉపముఖ్యమంత్రి కె.నారా యణస్వామి, కలెక్టర్‌ హరినారాయణన్‌ వెళ్ళారు. రాష్ట్రపతి 3 గంటల పర్యటనా కార్యక్రమంలో డిఐజి క్రాంతి రాణా టాటా జిల్లా ఎస్‌పి సెంథిల్‌కుమార్‌లు పటిష్ట పోలీస్‌ బందో బస్తు ఏర్పాటు చేశారు.