ఆమె ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వండి..

వ్యధ-వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం

Give priority to her will
Give priority to her will

ఇప్పటికీ కొందరు ఆడపిల్లల్ని అంగడి బొమ్మల్లా చూస్తున్నారు. వారి ఇష్టా ఇష్టాలతో పనిలేకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు. కొందరైతే ఆడపిల్లల్ని ఏదో ఒకవిధంగా వదిలించుకుంటే చాలని భావిస్తున్నారు. ఒక అయ్య చేతిలో పెట్టి భారం దించుకుంటే చాలనుకుంటున్నారు. కన్నకూతుళ్ల గొంతులు కోస్తున్నారు. ఈడూ, జోడు చూడకుండా పెళ్లిళ్లు చేస్తు న్నారు. కొంతమంది బాల్య వివాహాలు చేయడానికి వెనుకాడ డంలేదు. మా బంధువులలో ముగ్గురి జీవితాలే ఇందుకు సాక్ష్యం. అందులో ఇద్దరు భర్తల్ని వదిలేసి, ఒంటరి జీవితాలు గడుపు తున్నారు.

ఏడాదిక్రితం పెళ్లయిన ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో తెలియడం లేదు. నా స్నేహితురాలు ఒకామె ఇంటర్‌ చదువ్ఞతుండగా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు.

అప్పట్లో ఆమె వయస్సు 17ఏళ్లు. కాగా భర్త వయస్సు 28 సంవత్సరాలు. అతను పోలీసుగా పనిచేస్తున్నాడు. నా స్నేహితురాలి తల్లిదండ్రులు అప్పుల్లో ఉన్నందున అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. వారి అప్పులు తీరుస్తానని, పెళ్లయిన తర్వాత భార్యను చదివిస్తానని నమ్మించాడు. పెళ్లయిన తర్వాత చేతులెత్తేశాడు. అప్పులు కట్టకపోయినా, చదువు చెప్పించకపోయినా భార్యను బాగా చూసుకుంటే చాలనుకున్నారు. అయితే అతను ఒక శాడిస్టు, అనుమానపు పిశాచి. ఆమెను అనేక విధాలుగా హింసపెట్టాడు. కొట్టడం, అనుమానించి వేధించడం నిత్యకృత్యంగా మారింది. అనుమానంతో రెండుసార్లు గర్భవిచ్చిత్తి చేయించాడు.

ఎలాగో ఒక పాపకు జన్మనిచ్చింది. ఐదేళ్ల అనంతరం భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. తాను స్వంతంగా పి.జి.వరకు చదువుకుని, ఉద్యోగం చేస్తూ 15 ఏళ్ల కూతుర్ని చదివించుకుంటు న్నది. అలాగే మరొక ఆమెను చిన్న వయస్సులోనే మేనమామకిచ్చి పెళ్లిచేశారు. ఆమె ముగ్గురు ఆడపిల్లలను కన్న తర్వాత భర్తతో వేగలేక పారిపోయి పుట్టింటికి వచ్చేసింది.

పొలం పనులు చేసుకుంటూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. పెద్దవారిద్దరికి కొత్త సంబంధాలు కుదిర్చి పెళ్లి చేసింది. చిన్న అమ్మాయిని బలవంతంగా ఒప్పించి తన తమ్ముడికిచ్చి వివాహం చేసింది. అమ్మాయికి 16 ఏళ్లు అతనికి 32 సంవత్సరాలు. అతను ఒక ప్రైవేటు సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు.
పెళ్లయి ఏడాది కూడా కాకుండానే ఆమె భర్తను వదిలేసి పుట్టింటికి చేరింది.

అతని ప్రవర్తన తనకు నచ్చలేదని, చాల మొరటుగా ప్రవర్తిస్తు న్నాడని చెప్పింది. అతనితో కాపురం చేయలేనని, బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని అంటోంది. అయితే ఆమె తల్లి మాత్రం ఏదో విధంగా ఆమె మనసు మార్చి భర్త వద్దకు పంపేందుకు ప్రయత్నిస్తోంది. ఎవరైనా సైకాలజిస్టు ద్వారా కౌన్సెలింగ్‌ చేయించి, అవసరమైతే హిప్నాటిజం చేయించి ఆమె మనసు మార్చాలని చూస్తున్నది. నన్ను కూడా సలహా అడిగింది.

పైఇద్దరి జీవితాలను చూసినతర్వాత ఈ అమ్మాయికి విడాకులు ఇప్పించి, చదివించి తన కాళ్లపై తాను నిలబడేలా చేయడం మంచిదనిపిస్తోంది. అయితే ఆమె తల్లి మాత్రం అవన్నీ వీలుకావని ఏదోవిధంగా భర్త దగ్గరకు పంపేమార్గం చెప్పమం టోంది.తాను జీవితాన్ని పాడు చేసుకున్నట్టే, తన కూతురి జీవితం పాడు చేయడానికి సిద్ధపడు తోంది. ఈ దశలో ఆ అమ్మాయి జీవితాన్ని చక్కదిద్దే మార్గం చెప్పండి.

  • కౌసల్య, అనంతపురం

అమ్మా, మీ సామాజిక స్పృహకు జోహారు. మన సమాజంలో ఆది నుంచి ఆడపిల్లల్ని భారంగానే భావిస్తున్నారు. పైగా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, స్వంత విషయంలో తప్పు చేస్తున్న పెద్ద మనషులు ఉన్నారు. చాలావరకు మహిళల పరిస్థితులలో మార్పు వచ్చింది. అయినా అక్కడక్కడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

కొంతమంది విధిలేక మరికొందరు మతిలేక కన్న కూతుళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారు. బాల్యవివాహాలు తప్పని చట్టాలు చేశారు. మేనరికాలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయినా కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగలేక ఏదో ఒక విధంగా పెళ్లి చేసి ఆడబిడ్డను వదిలించుకోవాలని చూస్తున్నారు.

కొంతమంది బంధుత్వాల మీద లేదా ఆస్తుల మీద వ్యామోహంతో ఇప్పటికీ మేనరికాల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలిసితెలిసి తప్పు చేస్తున్నప్పటికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. సామాజిక, ఆర్థిక, కుటుంబ, మానసిక స్థితిగతులు మనిషిని ప్రభావితం చేస్తుంటాయి.

విధిలేని పరిస్థితులలో తలొగ్గి తప్పులు చేస్తుంటారు. అయితే మీరు చెబుతున్న కొత్తగా పెళ్లయిన అమ్మాయి విషయం కొంత సంక్లిష్టంగానే భావించాలి. అమ్మాయి ఇష్టం, చట్టం ప్రకారం నడుచుకోవడం మంచిదని నా అభిప్రాయం. కౌన్సెలింగ్‌, హిప్పాటిజం ద్వారా మనుషుల చేత నచ్చనివి చేయించలేం. కాబట్టి తల్లికి నచ్చజెప్పి, అమ్మాయి జీవితాన్ని బాగు చేయడం మంచిది.

  • డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు