రిలయన్స్‌తో మరో సంస్థ భారీ పెట్టుబడి

రిటైల్ విభాగంలో 1.28 శాతం వాటా కొనుగోలు చేసిన కేకేఆర్

Mukesh Ambani

ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్, మరో భారీ డీల్ ను కుదుర్చుకుంది. అనుబంధ రిలయన్స్ రిటైల్ లో యూఎస్ కు చెందిన కేకేఆర్ 1.28 శాతం వాటాలను కొనుగోలు చేయడం ద్వారా రూ. 5,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని ఆర్ఐఎల్ నేడు యూఎస్ స్టాక్ మార్కెట్ కు తెలియజేసింది. రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నామని సంస్థ పేర్కొంది. కాగా, రెండు నెలల క్రితం ఇదే కేకేఆర్ రిలయన్స్ జియోలో రూ. 11,367 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఇప్పుడు మరోమారు అదే సంస్థలో పెట్టుబడి పెట్టింది. రిలయన్స్ రిటైల్ లో ఇటీవలే సిల్వర్ లేక్ సైతం 1.75 శాతం వాటాను గొనుగోలు చేసింది.

కేకేఆర్ పెట్టుబడులను స్వాగతిస్తున్నామని, ఇవి దేశంలోని ప్రతి ఒక్కరికీ రిలయన్స్ రిటైల్ ను దగ్గర చేసేందుకు ఉపకరిస్తాయని నమ్ముతున్నామని బుధవారం నాడు ముఖేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. ఇండియాలో రిటైల్ వ్యవస్థ అభివృద్ధి, ప్రజల ప్రయోజనాల దిశగా తమ ప్రయాణం సాగుతుందని అన్నారు. ఇదే డీల్ పై స్పందించిన కేకేఆర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సెన్రీ క్రావిస్, ఈ డీల్ తో ఇండియాలో తమ ప్రాతినిధ్యం పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/