నేడు నల్గొండ జిల్లా కార్యకర్తలతో షర్మిల సమావేశం

హాజరు కానున్న 150 మంది వైఎస్ అభిమానులు

హైదరాబాద్‌: దివంగత సిఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల మంగళవారం తెలంగాణలో కొత్త పార్టీ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నేడు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో షర్మిల సమావేశం కానుండగా, ఇప్పటికే సూర్యాపేట, భువనగిరి తదితర ప్రాంతాలకు చెందిన వైఎస్ అభిమానులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆపై అన్ని జిల్లాల సమావేశాలూ వరుసగా జరుగుతాయని, ఎవరు ఎప్పుడు రావాలన్న విషయమై ఇప్పటికే క్షేత్ర స్థాయిలోని అభిమానులకు సమాచారం అందిందని తెలుస్తోంది.

ఈ ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరనున్న షర్మిల, ఉదయం 10 గంటల తరువాత హైదరాబాద్, లోటస్ పాండ్ కు చేరుకుని, అభిమానులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇవి కేవలం ఆత్మీయ సమావేశాలేనని షర్మిల వర్గం చెబుతున్నా, కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కాగా, టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీల్లో క్రియాశీలకంగా లేని నేతలను షర్మిల వర్గం గత వారం రోజులుగా సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.

నేడు దాదాపు 150 మందితో షర్మిల సమావేశం అవుతున్నారని తెలుస్తుండగా, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురికి కూడా ఫోన్లు వెళ్లాయి. అభిమానుల నుంచి తొలుత రాజకీయ రంగ ప్రవేశంపై అభిప్రాయాలను షర్మిల కోరతారని, ఆ తరువాతే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.