ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపుతున్న జికా వైరస్

నిన్న కొత్తగా 16 కేసుల నమోదు

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ ను జికా వైరస్ వణికిస్తోంది. నిన్న కొత్తగా 16 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు యూపీలో 106 కేసులు నమోదయ్యాయి. కొత్తగా వైరస్ బారిన పడిన వారిలో తొమ్మిది మంది పురుషులు, ఏడుగురు మహిళలు, ఇద్దరు గర్భిణులు ఉన్నారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీపాల్ సింగ్ మాట్లాడుతూ… కొత్తగా వైరస్ బారిన పడిన 16 మంది కాన్పూర్ లోని హర్జీందర్ నగర్, పోఖార్ పూర్, తివారీపూర్ బగియా, క్వాజీ ఖేరా ప్రాంతాలకు చెందిన వారని చెప్పారు. వైరస్ బారిన పడిన గర్భిణులకు వైద్యులు అల్ట్రాసౌండ్ టెస్టులు నిర్వహించారని… ఇద్దరి గర్భాల్లోని పిండాలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.

జికా వ్యాప్తి నేపథ్యంలో కాన్పూర్ లో 100 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. హోం శాంపిల్స్ ను కలెక్ట్ చేసేందుకు 15 టీమ్ లను నియమించారు. జికా వ్యాప్తిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు 15 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను రంగంలోకి దించారు. జికా బారిన పడిన వారిలో అత్యధికులు అసింప్టొమేటిక్ అని వైద్యాధికారులు తెలిపారు. వైరస్ నేపథ్యంలో డోర్ టు డోర్ సర్వే, శాంప్లింగ్ చేస్తున్నామని వెల్లడించారు. వైరస్ ఉన్న ప్రాంతాల్లోని గర్భిణులకు ప్రత్యేక సూచనలు చేస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 23న తొలి జికా వైరస్ కేసును గుర్తించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఒక వారంట్ ఆఫీసర్ జికా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. దోమల వల్లే జికా వైరస్ వస్తోందని వైద్యులు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/