యువరాజ్‌కు గృహహింస కేసులో ఊరట

Yuvraj Singh
Yuvraj Singh

న్యూఢిల్లీ: భారత స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పై అప్పట్లో గృహ హింస ఆరోపణలు రావడం తెలిసిందే. యువీ తమ్ముడు జొరావర్ సింగ్ మాజీ భార్య ఆకాంక్ష సింగ్ రెండేళ్ల కిందట తీవ్ర ఆరోపణలు చేసింది. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ యువీ కుటుంబంపై ఫిర్యాదు చేసింది. అప్పటినుంచీ ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. తాజాగా ఆకాంక్ష సింగ్ తన ఆరోపణలను వెనక్కి తీసుకుంది. దీనిపై యువరాజ్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.

చట్టం నుంచి తప్పించుకోలేనని భావించి ఆకాంక్ష సింగ్ తాను చేసిన ఆరోపణలు తప్పు అని ఒప్పుకుందని తెలిపారు. యువీకి పేరుప్రతిష్ఠలు ఉండడంతో, వాటిని అడ్డంపెట్టుకుని తమ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. యువరాజ్ ను ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో భాగం చేశారని వివరించారు. ఆకాంక్ష సింగ్ గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. యువీ తమ్ముడు జొరావర్ తో పెళ్లి ఆర్నెల్లలోపే పెటాకులైంది. అప్పట్లో ఆమె చేసిన ఆరోపణలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. యువీ గంజాయి తాగుతాడని, యువీతో పాటు ఇంట్లో అందరికీ ఆ అలవాటు ఉందని తెలిపింది. ఆఖరికి తాను కూడా భర్తతో కలిసి గంజాయి తాగాల్సి వచ్చిందని పేర్కొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/