27 వ రోజు యువగళం హైలైట్స్

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా 27 వ రోజు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గం లో లోకేష్ యాత్ర కొనసాగుతుంది. లోకేష్ ప్రజలు , యువత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారు.
తిరుపతిలోని అంకుర ఆసుపత్రి సమీపంలోని విడిదికేంద్రంలో భవన నిర్మాణ కార్మికులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇసుకపై ఏడాదికి రాష్ట్రవ్యాప్తంగా రూ.5 వేలకోట్లు దోచుకుంటున్నాడని, ఒక్క చిత్తూరు జిల్లాలోనే రోజుకు రూ.3 కోట్లరూపాయలు వసూలు చేస్తున్నాడని ఆరోపిస్తూ, ఈ దోపిడీని తాను ఆధారాలతో సహా నిరూపించగలనని లోకేష్ అన్నారు. ఏపీలో బంగారం సులభంగా దొరుకుంది కానీ ఇసుక దొరకదని సెటైర్ వేశారు. తిరుపతికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు. తండ్రి మద్యం తాగొద్దు అంటే… మద్యం సిండికేట్ ఏర్పాటు చేసింది మాత్రం కొడుకు అభినయ్ రెడ్డి అని విమర్శించారు.
తిరుపతి పట్టణంలో పాదయాత్ర దారిలో దిశ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఆగిన లోకేశ్ సెల్ఫీ దిగి, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “అసలు దిశ చట్టమే లేదు కానీ పోలీస్ స్టేషన్లు మాత్రం ఏర్పాటు చేశారు. మహిళలపై దాడులకి పాల్పడితే 21 రోజుల్లో నిందితుల్ని శిక్షించే దిశ చట్టం తెచ్చామని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. సీఎం ఇంటికి సమీపంలో అంధ దళిత యువతిని నరికి చంపేస్తే, గంజాయి తాగి కాదు… మద్యం తాగి చంపాడు, అదేం అంత పెద్ద నేరం కాదని మహిళా హోం మంత్రి చెప్పిన తీరు రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణలేదని తేల్చేసిందని లోకేష్ చెప్పుకొచ్చారు.