అసెంబ్లీలో కొట్టుకున్న వైస్సార్సీపీ- టీడీపీ ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజున ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైస్సార్సీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ వాతావరణం తలపించింది. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై వైస్సార్సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు దాడి చేశారు. దీంతో స్పీకర్ అసెంబ్లీ ని వాయిదా వేశారు.

ఏడో రోజు సభ సమావేశాలు ప్రారంభంకాగానే టీడీపీ వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది. జీవో నంబర్ 1ను రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుమట్టి నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు పేపర్లు చించి స్పీకర్‌పైకి విసిరారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు.

టీడీపీకి పోటీగా వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్లారు. స్పీకర్ పోడియం దగ్గర వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య టీడీపీ సభ్యులపైకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కొండేపి టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి , సంతనూతలపాడు టీజేఆర్ సుధాకర్ బాబు ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.