జగన్‌ను టార్గెట్‌ చేస్తున్న మోడి సర్కార్‌ ?

Narendra Modi & CM Jagan
Narendra Modi & CM Jagan

అమరావతి: ఏపిలో రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. ఒకపక్క టిడిపిని టార్గెట్‌ చేస్తూ సిఎం జగన్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంటే, మరోపక్క బిజెపి వైఎస్‌ఆర్‌సిపిని టార్గెట్‌ చేస్తూ రాజకీయ చదరంగంలో కొత్త మలుపులు తిప్పుతుంది. గత కొద్ది రోజులుగా వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఎంపీలు.. వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటరీ నేత అయిన విజయసాయిరెడ్డి ముందు తమ అసహనం వ్యక్తం చేసుకోగా, తాను సిఎం జగన్‌తో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ అనుమతి లేనిదే ప్రధాని మోడిని కలవద్దన్నా పట్టించుకోకుండా కొందరు ఎంపీలు మోడిని, కేంద్రమంత్రులతో సైతం మీటింగ్స్‌ అంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన జగన్‌ సదరు ఎంపీలకు షోకాజ్‌ నోటీసులు ఇస్తామని వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో వారు వైఎస్‌ఆర్‌సిపిని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు, అంతేకాకుండా ప్రధాని మోడితో ఇంకా కేంద్రమంత్రులతో పాటు ప్రధాన మంత్రి కార్యాలయంతో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు బిజెపి ఎంపి సుజనా చౌదరి టిడిపి ఎమ్మెలేలతో పాటు , వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు కూడా తమతో టచ్‌లో ఉన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జగన్‌ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. అయితే ఆ ఎంపీలు ఎవరన్న విషయాన్ని బయటపెట్టకుండా, సమయం వచ్చినప్పుడు వారిని పార్టీలో చేర్చుకుంటామని చెప్పడంతో అది పెద్ద చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఏపి రాజకీయాల్లో రానురాను ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business