వైసీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ పార్టీ అభ్యర్ధులను వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. పాలవలస విక్రాంత్(శ్రీకాకుళం), ఇషాక్ బాషా(కర్నూలు), డీసీ గోవిందరెడ్డి(కడప)లను వైఎస్సార్‌సీపీ ఖరారు చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 11 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. అనంతపురం-1, కృష్ణా-2, తూర్పుగోదావరి-1, గుంటూరు-2, విజయనగరం-1, విశాఖపట్నం-2, ప్రకాశం-1 స్థానాలకు షెడ్యూల్ ప్రకటించారు. నవంబర్ 16న నోటిఫికేషన్, డిసెంబర్ 10న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది.
తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా కింద మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం.. కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండు స్థానాలకు మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించారు. నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23న నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ, నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26న ఉపసంహరణకు చివరి తేదీ, డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న కౌంటింగ్ జరగనుంది.