క‌న్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా

2002 వరకు కష్టపడి సంపాదించిన‌ మొత్తాన్ని అప్పులకే కట్టానన్న ఎమ్మెల్యే

అమరావతి: వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో క‌న్నీరు పెట్టుకుని అంద‌రితో కంట‌త‌డి పెట్టించారు. గ‌తంలో తాను అనుభ‌వించిన క‌ష్టాల‌ను గురించి చెప్పారు. వినాయక చవితి సందర్భంగా ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె భావోద్వేగభ‌రిత వ్యాఖ్య‌లు చేశారు. తాను 1991లో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాన‌ని చెప్పారు. 2002 వరకు కష్టపడి సంపాదించిన‌ మొత్తాన్ని అప్పులకే కట్టానని తెలిపారు. పెళ్లి చేసుకునే ముందు త‌నకు ఆరోగ్య‌ సమస్య ఉండేద‌ని, త‌న‌కు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారని వివ‌రించారు. అయితే, పెళ్లైన ఏడాదికే గ‌ర్భ‌వ‌తి అయ్యాన‌ని, అన్షు పుట్టిందని చెప్పారు. అందుకే అన్షు అంటే త‌న‌కు చాలా ఇష్టమ‌ని తెలిపారు.

కాగా, చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున వంటి స్టార్ హీరోల‌తో న‌టించిన రోజా త‌న న‌ట‌న‌తో పాటు డ్యాన్స్‌తో ఎంత‌గానో ఆకట్టుకుంది. చిరంజీవితో స‌రిస‌మానంగా డ్యాన్స్ చేయ‌గ‌ల‌ద‌ని పేరు తెచ్చుకున్న రోజా కొన్నాళ్లకు సినిమాలు వ‌దిలేసి ప్ర‌స్తుతం బుల్లితెర కార్య‌క్ర‌మాల‌కు జడ్జిగా వ్య‌వ‌హ‌రిస్తుంది. మ‌రోవైపు రాజ‌కీయాల‌లోను స‌త్తా చాటుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/