చంద్రబాబుపై రోజా విమర్శలు

కుటుంబ సభ్యులతో తిరుమల విచ్చేసిన రోజా

mla roja
mla roja

తిరుమల: నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన సోదరుడి పెళ్లిరోజు, తన మేనకోడలి పుట్టినరోజు కావడంతో నేడు స్వామివారి దీవెనలు అందుకునేందుకు వచ్చామని రోజా మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర రాజకీయాలపైనా స్పందించారు. సిఎం జగన్ చిన్నవాడైనా ఎంతో పద్ధతిగా, పారదర్శకంగా రాజకీయాలు నడపడం చూస్తున్నామని, కానీ చంద్రబాబు జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలేనని విమర్శించారు. తిరుపతి ఎంపీ కరోనాతో చనిపోతే వెంటనే అభ్యర్థిని నిలబెట్టి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని రాజకీయాలకు తెరలేపిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.

రాష్ట్రం ఓవైపు కరోనాతో అతలాకుతలం అవుతుంటే, 14 ఏళ్లు సిఎంగా చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలనో, భరోసా ఇవ్వాలనో ప్రయత్నించకుండా హైదరాబాద్ లో దాక్కున్నాడంటూ చంద్రబాబును ఏకిపారేశారు. తనను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకు పార్టీ తరఫునో, తన తరఫునో మద్దతుగా నిలవాల్సిన చంద్రబాబు రాజకీయాలే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సిఎం జగన్ పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఎవరైనా ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ చనిపోతే పార్టీలకు అతీతంగా వారి కుటుంబాలను ఆదుకుంటున్నారని, వారి కుటుంబాలకు పోటీగా అభ్యర్థిని నిలిపేందుకు సైతం ఆయన ఇష్టపడరని కొనియాడారు. కానీ చంద్రబాబు మాత్రం ఎప్పుడు ఎవరు చనిపోతారా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ రాష్ట్రంలో తన చక్రం తిప్పాలా అని ఎదురుచూస్తుంటారని ఆరోపించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/