నాకు, నాభర్తకు ప్రాణభయం ఉంది.. రక్షణ కల్పించండి

సాయుధ రక్షణ కల్పించమని ఏపీ డీజీపీని కోరిన వైయస్ వివేకా కూతురు

ys vivekananda reddy daughter sunitha
ys vivekananda reddy daughter sunitha

అమరావతి: వైయస్ వివేకా కుమార్తె సునీత తండ్రి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ఆమె పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే తనకు, తన భర్త ఎన్.రాజశేఖరరెడ్డికి ప్రాణభయం ఉందని  హైకోర్టుకు సునీత తెలిపారు. తన తండ్రిని హత్య చేసిన వారు తనను, తన భర్తను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందనే భయాందోళనలను ఆమె వ్యక్త పరిచారు. తమకు సాయుధ రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రాసిన లేఖను కూడా హైకోర్టుకు అందజేశారు. ఈ లేఖను గత ఏడాది నవంబర్ 21న డీజీపీకి ఆమె రాశారు. ఈ కేసులో కీలకమైన శ్రీనివాసరెడ్డి ఇప్పటికే హత్యకు గురయ్యారని… ఈ నేపథ్యంలో పరమేశ్వరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, వాచ్ మెన్ రంగయ్య ప్రాణాలకు కూడా ముప్పు ఉందనే ఆందోళన తనకు ఉందని సునీత తెలిపారు. దర్యాప్తు వేగవంతంగా కొనసాగేందుకు తాను, తన భర్త పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నామని… అయినా హంతకుడెవరో ఇంతవరకు గుర్తించలేకపోయారని ఆమె వాపోయారు. ఈ పరిస్థితుల్లో తన కుటుంబ భద్రత పట్ల ఆందోళన కలుగుతోందని కోర్టుకు తెలిపారు.


తాజా అంతర్జ్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/