TSPSC ఆఫీస్ ముట్టడికి వైఎస్ షర్మిల యత్నం..అరెస్ట్

TSPSC పేపర్ లీక్ ఘటన నేపథ్యంలో శుక్రవారం YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ..టీఎస్‌పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసారు. టీఎస్పీఎస్సీ ఆఫీసుకు అరకిలోమీటర్ ముందే షర్మిలను నిలవరించారు పోలీసులు. దాంతో షర్మిల తన కార్యకర్తలతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలంతా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేయడంతో టీఎస్పీఎస్సీ ఆఫీసు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు.

ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి కాసేపటి తర్వాత విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా పేపర్ లీకేజీపై షర్మిల స్పందించారు. పేపర్ లీక్ కేసులో పెద్దవాళ్లను తప్పిస్తున్నారని, చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆందోళన అనగానే హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారని, తనకు లుకౌట్ నోటీసులు ఇచ్చారని షర్మిల తెలిపారు. లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి తానేమన్నా క్రిమినల్‌నా? అంటూ షర్మిల ప్రశ్నించారు.