కాంగ్రెస్ పార్టీపై షర్మిల విమర్శలు

YSRTP అధినేత్రి వైస్ షర్మిల..ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఫై నిప్పులు చెరిగారు. గురువారం మెదక్ లోని నర్సాపూర్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ కి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని.. నేను పబ్లిక్ గా చెప్తున్నానని, 30 ఏళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ కి సేవ చేశాడన్నారు. 2004లో 2009 లో రెండు సార్లు వైఎస్సార్ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారన్నారు. వైఎస్సార్ చేసిన పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించారని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో వైఎస్సార్ కీలకమన్నారు.

అలాంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ చనిపోతే దోషి అని FIR లో నమోదు చేసిందని, ఇది వైఎస్సార్ కి వెన్నుపోటు పొడిచినట్లు కాదా రాజశేఖర్ రెడ్డి గారిని మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో రాజ‌శేఖ‌ర‌రెడ్డి చ‌నిపోతే… ఆ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ పార్టీ క‌నీసం విచార‌ణ కూడా చేయించ‌లేద‌ని ఆరోపించారు. బ‌తికుండ‌గానే రాజ‌శేఖ‌ర‌రెడ్డిని పొగిడిన కాంగ్రెస్ పార్టీ ఆయ‌న చ‌నిపోగానే నింద‌లు వేసింద‌ని ఆమె ఆరోపించారు. నింద‌లు వేసిన రాజ‌శేఖ‌ర‌రెడ్డి బొమ్మ‌ను పెట్టుకుని కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు ఓట్లు అడుగుతున్నార‌ని ఆమె మండిప‌డ్డారు.

వైఎస్సార్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదని, ఇప్పుడు వైఎస్సార్ బ్రతికి ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మి వేసేవాడన్నారు. కాంగ్రెస్ పార్టీ కి వైఎస్సార్ ఖ్యాతిని తెచ్చారు…వైఎస్సార్ కి కాంగ్రెస్ ఖ్యాతిని తేలేదని, వైఎస్సార్ చనిపోయాక కాంగ్రెస్ 5 ఏళ్లు అధికారంలో ఉందని, వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదన్నారు. నాయకుడు అంటే వైఎస్సార్ లా ఉండాలని నిరూపించాడని ఆమె వ్యాఖ్యానించారు.