రవి కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల

రవి కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని చెల్లించాలి: షర్మిల

మెదక్ : మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలం బొగుడ భూపతిపూర్ కు చెందిన రైతు రవి కుటుంబాన్ని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకున్న రవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వడ్లు వేయాల్సిన రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. భూమిని నమ్ముకుని రైతు వ్యవసాయం చేస్తాడని… అలాంటి రైతు గుండె ఆగిపోయేలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కుటుంబాలను కూడా పోషించలేని దుస్థితిలో రైతులు ఉన్నారని… వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. వరి వేసుకోకపోతే ఉరే వేసుకోవాలంటూ కేసీఆర్ కు రవి లేఖ రాసి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

వరి వేయవద్దు అని రైతులకు చెప్పే హక్కు కేసీఆర్ కు ఎవరిచ్చారని షర్మిల ప్రశ్నించారు. ఆఖరి గింజ వరకు కొంటానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. పంట పండించడం రైతు బాధ్యతైతే… మద్దతు ధరను పొందడం రైతు హక్కు అని అన్నారు. రవి కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని కేసీఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రవి కుటుంబాన్ని ఆదుకునేంత వరకు ఇక్కడే ఉండి నిరాహారదీక్ష చేస్తానని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/