వైఎస్ షర్మిల అరెస్ట్ ..

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద చేపట్టిన షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసు అధికారులు ప్రభుత్వాధినేతల సేవ తప్ప, సామాన్యుల రక్షణ పట్టించుకోవడం లేదన్నారు.

పోలీసులు దీక్షకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు అనుమతులు లేవని చెప్పడం సరికాదన్నారు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తాను దీక్ష చేపడతానని షర్మిల స్పష్టం చేశారు. తాము శాంతియుతంగా దీక్ష చేయాలనుకుంటే.. ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించేందుకు ఆమె మేడిపల్లి పీఎస్‌కు బయలుదేరారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల, పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. ఈ క్రమంలో మేడిపల్లి పీఎస్‌కు వైఎస్సార్టీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో షర్మిలను పోలీసులు ఘటకేశ్వర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.