విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న వైస్ షర్మిల

YSRTP అధినేత్రి వైస్ షర్మిల ఫై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు. లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ షర్మిలను ఇంటి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో షర్మిల కారులో బయటకు వెళుతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారును ముందుకు వెళ్లనీయకుండా అడ్డుగా నిల్చున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వైఎస్ షర్మిల.. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా కాసేపు రోడ్డుపై షర్మిల బైఠాయించారు. రోడ్డు మీద నుంచి లేమని సర్ది చెప్పడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులను తోసేసుకుంటూ బయటకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నం చేశారు.

రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేయడం తో పాటు కానిస్టేబుల్ ఫై చేయి చేసుకున్నారు. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో షర్మిల ఫై IPC 353 , 330 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. పర్సనల్ పనులకు తనని బయటకు వెళ్లనివ్వరా అని షర్మిల ప్రశ్నించారు. షర్మిలతో తన గన్ మెన్ ను కూడా వెళ్లకుండా పోలీసులు ఆపేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. పోలీసులు కేసీఆర్ కోసమే పనిచేస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. షర్మిల అరెస్ట్ నేపథ్యంలో లోటస్ పాండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.