మండలి రద్దు, ప్రత్యేక హోదా..అమిత్ షాకు విజ్ఞప్తి

పలు అంశాలపై అమిత్, జగన్ చర్చలు

jagan- amit shah
jagan- amit shah

న్యూఢిల్లీ: ఏపి సిఎం జగన్‌ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. ఈనేపథ్యలో జగన్‌ ఏపికి ప్రత్యేక హోదాను కల్పించాలని, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన శాసన మండలి పక్షపాతంతో వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నందున రద్దు చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. దాదాపు అరగంటకు పైగా ఆయనతో చర్చలు జరిపిన జగన్, పలు విషయాలను ఆయన ముందుంచారు. మండలిని రద్దు చేయాలని రాష్ట్ర అసెంబ్లీ, మూడింట రెండు వంతులకు పైగా మెజారిటీతో సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. శాసన సభ నుంచి పంపిన తీర్మానంపై తదుపరి చర్యలకు న్యాయ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేస్తున్న బిల్లులను అడ్డుకుంటున్న ఆ సభ తమ రాష్ట్రానికి అక్కర్లేదని అన్నారు.

అమిత్ షాతో భేటీ అయిన జగన్, ఏపీకి సంబంధించి పలు అంశాలను చర్చించారు. పోలవరం ప్రగతి, మూడు రాజధానులు, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, మహిళల రక్షణకు తీసుకుని వచ్చిన దిశ చట్టానికి కేంద్రం ఆమోదం తదితర అంశాలపై వీరిమధ్య చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో రూ. 838 కోట్లను ఆదా చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఏర్పడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేయాలని జగన్ కోరారు. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర సర్కారు వెచ్చించిన రూ. 3,320 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/