వైఎస్‌ భాస్కర రెడ్డి అస్వస్థత

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టై హైదరాబాద్‌లోని చంచల్‌ గూడ జైల్లో ఉన్న వైఎస్‌ భాస్కర రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. నాలుగైదు రోజులుగా ఆయనకు రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉండటం, ఈసీజీలోనూ వ్యత్యాసాలు కనిపించాయి. దీంతో ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు.

కార్డియాలజీ విబాగాధిపతి డా.ఇమాముద్దీన్‌ ఆధ్వర్యంలో వైద్యులు భాస్కరరెడ్డిని పరీక్షించి మొరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాల్సిందిగా సూచించి పంపినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌ తెలిపారు. చికిత్స అనంతరం జైలు అధికారులు అతడిని తిరిగి చంచల్‌గూడ కారాగారానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం నిమ్స్‌కి తరలించే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవినాశ్ రెడ్డి తల్లిని శుక్రవారం డిశ్చార్జ్ చేశారు వైద్యులు. అయితే మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఈ నెల 19 నుంచి కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీలక్ష్మీ ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసే దిశగా సీబీఐ అడుగులు వేస్తోంది. అయితే అవినాశ్ రెడ్డి… కోర్టులను ఆశ్రయిస్తుండటం, విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని సీబీఐని కోరటం వంటి పరిణామాలు చోటు చేసుకోవటంతో… అవినాశ్ రెడ్డి విషయంలో సీబీఐ ఎలా ముందుకెళ్లబోతుందనేది ఆసక్తికరంగా మారింది.